జగద్ధరభట్టు విరచిత స్తుతి కుసుమాంజలి లోని 15వ స్తోత్రము (కరుణారాధనము) .(40 శ్లోకాలు)
కరుణారాధనము
(1-3 శ్లోకములు)
శ్లోకములు:
అధునా తపసేవ దేవతామభియోగేన సరస్వతీమివ ।
ముదేవ సమీహితాం శ్రియం ప్రగుణేనేవ గుణేన సంసదమ్ ॥ 1 ॥
ప్రతిభామివ కావ్యకర్మణా వసునా కీర్తిమివార్థగామినా ।
మనసీవ శమేన నిర్వృతిం సుకృతేనేవ పరత్ర సద్గతిమ్ ॥ 2 ॥
కరుణాం హరిణాంకలక్షణః సకలార్థార్పణకల్పవల్లరీమ్ ।
విపదంతకరీముపాసితుం స్తుతిలేశేన మనః ప్రవర్తతే ॥ 3 ॥
ప్రతిపదార్థము:
అధునా
= ఇప్పుడు, తపసా + ఇవ = తపస్సుచేత, దేవతామ్ = దేవతను
(ఉపాసించునట్లు), అభియోగేన = నిరంతర అభ్యాసముచేత, సరస్వతీమ్ + ఇవ = సరస్వతీ దేవిని, ముదా + ఇవ =
సంతోషముతో కూడిన సమూహముచేత, సమీహితామ్ = కోరబడిన, శ్రియమ్ = లక్ష్మిని, ప్రగుణేన = మిక్కిలి
శ్రేష్ఠమైన, గుణేన + ఇవ = పాండిత్యముచేత, సంసదమ్ = సభను, కావ్య + కర్మణా = కావ్య రచన అనెడి
పనిచేత, ప్రతిభామ్ + ఇవ = నూతన విషయములను స్ఫురింపజేయు
ప్రతిభను, అర్థగామినా = సత్పాత్ప్రులకు అందజేయబడిన, వసునా = ధనముచేత, కీర్తిమ్ + ఇవ = కీర్తిని, శమేన = ఇంద్రియ నిగ్రహముచేత, మనసి = మనస్సునందు,
నిర్వృతిమ్ + ఇవ = శాంతిని, సుకృతేన =
పుణ్యముచేత, పరత్ర = పరలోకమునందు, సద్గతిమ్
+ ఇవ = ఉత్తమ గతిని, హరిణాంక + లక్షణః = చంద్రుని చిహ్నముగా
గల శివుని యొక్క, సకల + అర్థ + అర్పణ + కల్పవల్లరీమ్ = సమస్త
పురుషార్థములను ప్రసాదించు కల్పవృక్షపు తీగ వంటిదియు, విపత్
+ అంతకరీమ్ = ఆపదలను అంతమొందించునదియు అయిన, కరుణామ్ =
కరుణను, స్తుతి + లేశేన = స్వల్పమైన ఈ స్తోత్రముచేత, ఉపాసితుమ్ = ఉపాసించుటకు, మే = నా యొక్క, మనః = మనస్సు, ప్రవర్తతే = పూనుకొనుచున్నది.
తాత్పర్యము:
లోకమునందు
ఒకడు తపస్సుతో దేవతను, అభ్యాసముతో సరస్వతిని, సముదాయముతో
లక్ష్మిని, పాండిత్యముతో సభను, కావ్యరచనతో
ప్రతిభను, దానముతో కీర్తిని, ఇంద్రియ
నిగ్రహముతో మనశ్శాంతిని, పుణ్యముతో సద్గతిని ఏ విధముగా
పొందగోరుతాడో; అట్లే నేను కూడా చంద్రశేఖరుడైన పరమేశ్వరుని
కరుణను ఆరాధించుటకు ఈ స్తోత్రమును రచిస్తున్నాను. శివుని కరుణ సమస్త కోరికలను
తీర్చే కల్పవల్లి వంటిది మరియు ఆపదలను నశింపజేసేది.
విశేషములు:
వ్యాఖ్యానమునందు
వివరించినట్లుగా, శివభక్తి అనేది సంసార తాపముతో అలమటించే వారికి చల్లని నీటి
ధార వంటిది. కవి ఇక్కడ అనేక ఉపమానముల ద్వారా శివకరుణ యొక్క గొప్పతనమును
చాటిచెప్పారు. కర్పూరపు కడ్డీ (ఘనసారశలాక) కళ్లకు ఏ విధంగా చలవను, ఆనందాన్ని ఇస్తుందో, శివభక్తి కూడా భక్తునికి
అటువంటి పరమానందాన్ని ఇస్తుందని ప్రాచీన కవి సూక్తిని ఇక్కడ ఉదహరించారు.
నాలుగవ
శ్లోకము
శ్లోకము: కరుణాం భవతో వికాసినీమమలైర్గణైరలంకృతామ్ । నళినీమళినివ భారతీ భజతీయమ్
మమ వల్గువాదినీ ॥ 4 ॥
ప్రతిపదార్థము:
హే + ఈశ్వర = ఓ ఈశ్వరా, వికాసినీమ్ = వికసించినట్టియు (విస్తారమైనట్టియు), అమలైః = నిర్మలమైన, గుణైః = దయ, దాక్షిణ్యాది గుణములచే (పద్మ పక్షమున సూక్ష్మమైన దారములచే), అలంకృతామ్ = అలంకరింపబడిన, భవతః = నీ యొక్క, కరుణామ్ = కరుణను, వల్గువాదినీ = మధురముగా పలికే,
ఇయమ్ = ఈ, మమ = నా యొక్క, భారతీ = వాక్కు, అళినీ = ఆడతుమ్మెద, నళినీమ్ + ఇవ = పద్మమును వలె, భజతి = సేవించుచున్నది
(ఆశ్రయించుచున్నది).
తాత్పర్యము:
ఓ ప్రభూ! వికసించిన పద్మమును మధురముగా ధ్వని చేసే ఆడతుమ్మెద ఏ విధంగా
ఆశ్రయిస్తుందో,
అట్లే నీ నిర్మల గుణాలతో శోభిల్లే నీ అపారమైన కరుణను నా మధుర వాక్కు
ఆశ్రయించి స్తుతిస్తోంది.
విశేషములు:
ఇక్కడ శ్లేషాలంకారము ద్వారా శివ కరుణను పద్మముతోను, కవి వాక్కును తుమ్మెదతోను
పోల్చడం చాలా మనోహరంగా ఉంది.
ఐదవ
శ్లోకము
శ్లోకము: ఉపలక్ష్య తవాంధకారితాం మయి ధత్తే పదమంధకారితా । విషమామవలోక్య తే దృశం
మమ దృష్టిర్విషమత్వమశ్నుతే ॥ 5 ॥
ప్రతిపదార్థము:
హే + విభో = ఓ స్వామీ, తవ = నీ యొక్క, అంధకారి + తామ్ =
అంధకాసురుని శత్రువైన స్థితిని (అంధకారిత్వమును), ఉపలక్ష్య =
చూచి, మయి = నా యందు, అంధకారితా =
చీకటి (అజ్ఞానము), పదమ్ = స్థానమును, ధత్తే
= ఏర్పరచుకొనుచున్నది, తే = నీ యొక్క, విషమామ్
= విషమ సంఖ్య గల (మూడు), దృశమ్ = కన్నును, అవలోక్య = చూచి, మమ = నా యొక్క, దృష్టిః = బుద్ధి (చూపు), విషమత్వమ్ = వైషమ్యమును
(కలతను), అశ్నుతే = పొందుచున్నది.
తాత్పర్యము:
ఓ విభూ! నీవు అంధకాసురుని సంహరించిన వాడవు (అంధకారివి). నీలోని ఆ అంధకారిత్వాన్ని
చూచి నాలో అజ్ఞానమనెడి చీకటి (అంధకారిత) చోటు చేసుకుంటోంది. నీకు మూడు కన్నులు
(విషమ నేత్రాలు) ఉండటం చూచి నా దృష్టి కూడా విషమత్వాన్ని (స్థిరత లేకపోవడాన్ని)
పొందుతోంది.
విశేషములు:
ఇక్కడ 'అంధకారి' మరియు 'విషమ' పదాల చమత్కారంతో కవి తన దీన స్థితిని శివుని వైభవంతో పోల్చి చెప్పారు.
ఆరవ
శ్లోకము
శ్లోకము: తవ వీక్ష్య వృషాధరీకృతిం ఘటతే మేऽపి
వృషాధరీకృతిః । ధతవక్రకలత్వమీక్ష్య తే ప్రథతే వక్రకలత్వమేవ మే ॥ 6 ॥
ప్రతిపదార్థము:
హే + విభో = ఓ ప్రభూ, తవ = నీ యొక్క, వృష + అధరీకృతిమ్ =
వృషభమును వాహనముగా చేసుకొనుటను (క్రింద ఉంచుకొనుటను), వీక్ష్య
= చూచి, మే + అపి = నా యందు కూడా, వృష
+ అధరీకృతిః = ధర్మమును వదిలివేయుట (అధర్మము), ఘటతే =
జరుగుచున్నది, ధత + వక్ర + కలత్వమ్ = వంకరగా ఉన్న చంద్రకళను
ధరించిన, తే = నిన్ను, ఈక్ష్య = చూచి,
మే = నా యొక్క, వక్ర + కలత్వమ్ + ఏవ =
కుటిలమైన విద్యలే, ప్రథతే = విస్తరించుచున్నవి.
తాత్పర్యము:
స్వామీ! నీవు వృషభాన్ని వాహనంగా చేసుకున్నావు (వృషాధరీకృతి). అది చూసి నేను
ధర్మాన్ని తృణీకరిస్తున్నాను (వృష-ధర్మమును అధరీకరిస్తున్నాను). నీవు వంకర
చంద్రకళను ధరించావు. అది చూసి నాలో కూడా కుటిలత్వము, వంకర బుద్ధులే పెరుగుతున్నాయి.
విశేషములు:
ధర్మమునకు వృషభము చిహ్నము. శివుడు వృషభ వాహనుడు కాబట్టి, భక్తుడు
తనలోని అధర్మాన్ని చమత్కారంగా సమర్థించుకుంటున్నాడు.
ఏడవ
శ్లోకము
శ్లోకము:
తవ వీక్ష్య చ భగ్నకామతాముదితేయం మమ భగ్నకామతా । కరుణామపి
తే సమీక్ష్య మే కరుణా గీర్న కథం ప్రవర్తతామ్ ॥ 7 ॥
ప్రతిపదార్థము:
హే + విభో = ఓ స్వామీ, భగ్న + కామతామ్ = మన్మథుని దహించినట్టి (కోరికలు లేనట్టి),
తవ = నీ స్థితిని, వీక్ష్య = చూచి, మమ = నా యొక్క, ఇయమ్ = ఈ, భగ్న
+ కామతా = భంగపడిన కోరికలు గల స్థితి, ఉదితా = కలిగినది,
తే = నీ యొక్క, కరుణామ్ + అపి = కరుణను కూడా,
సమీక్ష్య = చూచి, మే = నా యొక్క, కరుణా = దీనమైన, గీః = వాక్కు, కథమ్ = ఏల, న + ప్రవర్తతామ్ = ప్రవర్తించకూడదు
(స్తుతించకూడదు).
తాత్పర్యము:
ఓ నాథా! నీవు కాముని దహించిన వాడవు (భగ్నకాముడవు). అది చూసి నా కోరికలన్నీ భంగపడి
నేను నిరాశలో ఉన్నాను. నీవు లోక రక్షకమైన కరుణా స్వరూపుడవు కదా! అట్టి నీ కరుణను
చూసిన తర్వాత కూడా నా దీనమైన వాక్కు నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలదు?
విశేషములు:
ముందు మూడు శ్లోకాల్లో శివునిలోని కొన్ని అంశాలను తనలోని దోషాలతో పోల్చుకున్న
భక్తుడు, ఈ శ్లోకంలో శివుని కరుణను చూసి తన వాక్కు స్తుతికి పూనుకుంటోందని
ముగిస్తున్నాడు.
ఎనిమిదవ
శ్లోకము
శ్లోకము: ససురాసురమానుషం జగద్యదధీనం స భవానపీశ్వర । వశావర్తిపదే
యయార్పితో జయతీయమ్ కరుణైవ తావకీ ॥ 8 ॥
ప్రతిపదార్థము:
హే + ఈశ్వర = ఓ పరమేశ్వరా, ససుర + అసుర + మానుషమ్ = దేవతలు, అసురులు
మరియు మనుష్యులతో కూడిన, జగత్ = ఈ ప్రపంచమంతయు, యత్ + ఆధీనమ్ = ఎవరికి లోబడి ఉన్నదో, సః + భవాన్ +
అపి = అట్టి సర్వశక్తుడవైన నీవు కూడా, యయా = ఏ కరుణ చేతైతే,
వశావర్తి + పదే = నీకు విధేయుడవై ఉండు స్థితి యందు (ఆధీనమునందు),
అర్పితః = ఉంచబడ్డావో, తావకీ = నీదైన, ఇయమ్ = ఈ, కరుణ + ఏవ = కరుణయే, జయతి = సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నది.
తాత్పర్యము:
ఓ స్వామీ! ఈ చరాచర జగత్తు అంతా నీ ఆధీనంలో ఉంటుంది. కానీ, అట్టి
నిన్ను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి నీ 'కరుణ'కు మాత్రమే ఉంది. నిన్ను భక్తుల పట్ల విధేయునిగా చేసే నీ కరుణ అన్నిటికంటే
గొప్పది.
విశేషములు:
భగవంతుడు జగత్తుకు యజమాని అయితే, ఆయన కరుణ ఆయనకే యజమాని అని కవి ఇక్కడ
అత్యద్భుతముగా వర్ణించారు.
తొమ్మిదవ
శ్లోకము
శ్లోకము:
కరుణా తవ జీవితేశ్వరీమతిశేతే భగవన్నుమామపి । ఉమయా
హృతమర్ధమేవ యత్సకలస్త్వమ్ పునరేతయా హృతః ॥ 9 ॥
ప్రతిపదార్థము:
హే + భగవన్ = ఓ షడ్గుణైశ్వర్య సంపన్నుడా, తవ = నీ యొక్క, కరుణా
= కృప, జీవితేశ్వరీమ్ = నీ ప్రాణేశ్వరియైన, ఉమామ్ + అపి = పార్వతీ దేవిని కూడా, అతిశేతే =
మించిపోయినది, యత్ = ఏలయనగా, ఉమయా =
పార్వతి చేత, అర్థమ్ + ఏవ = (అర్ధనారీశ్వర రూపమున) సగభాగము
మాత్రమే, హృతమ్ = గ్రహింపబడినది, ఏతయా
= ఈ కరుణ చేత, పునః = అయితే, త్వమ్ =
నీవు, సకలః = పూర్తిగా, హృతః = వశం
చేసుకోబడ్డావు.
తాత్పర్యము:
ఓ భగవంతుడా! నీ కరుణ నీ ప్రాణప్రియయైన పార్వతీ దేవి కంటే గొప్పది. పార్వతి తన
తపస్సుతో నీ శరీరంలో సగభాగాన్ని మాత్రమే పొందగలిగింది. కానీ, నీ కరుణ
నిన్ను సంపూర్ణముగా తనవశం చేసుకుని భక్తుల పరం చేస్తోంది.
విశేషములు:
అర్ధనారీశ్వర తత్త్వాన్ని స్మరిస్తూ, పార్వతి కంటే కరుణకే శివునిపై ఎక్కువ
అధికారం ఉందని కవి చమత్కరించారు.
పదవ
శ్లోకము
శ్లోకము:
కరుణా తవ శస్యతే యయా జితకామోऽపి భవాన్వశీకృతః । ఇదమన్యదియం యదంబికామపి
దేవీమనయద్విధేయతామ్ ॥ 10 ॥
ప్రతిపదార్థము:
యయా = ఏ కరుణ చేత, జితకామః + అపి = మన్మథుని జయించిన (జితేంద్రియుడవైన)
వాడవైనప్పటికీ, భవాన్ = నీవు, వశీకృతః
= వశము చేసుకోబడ్డావో, సా = అట్టి, తవ
= నీ యొక్క, కరుణా = కరుణ, శస్యతే =
స్తుతించబడుచున్నది, ఇయమ్ = ఈ కరుణ, అంబికామ్
+ అపి = జగన్మాతయైన పార్వతీ దేవిని కూడా, విధేయతామ్ = తనకు
లోబడినదానినిగా, అనయత్ = చేసినది, యత్
= అనునది, ఇదమ్ + అన్యత్ = ఇది మరొక (ఆశ్చర్యకరమైన విషయము).
తాత్పర్యము:
ఓ స్వామీ! జితేంద్రియుడవైన నిన్నే వశం చేసుకోగలిగిన నీ కరుణా శక్తి అత్యంత
ప్రశంసనీయమైనది. అంతేకాదు, సర్వ స్వతంత్రురాలైన అంబికను కూడా తన అదుపులోకి తెచ్చుకోవడం ఈ
కరుణ యొక్క గొప్పతనం.
పదకొండవ
శ్లోకము
శ్లోకము:
జగదమ్బుభువా భువామ్భసా సీతభాసా నభసా నభస్వతా । ధృతముష్ణరుచాత్మనా
చ యత్కరుణాయా మహిమా తవేదౌ సః ॥ 11 ॥
ప్రతిపదార్థము:
అమ్బుభువా = అగ్ని చేతను, భువా = భూమి చేతను, అమ్భసా = జలము చేతను,
సీతభాసా = చంద్రుని చేతను, నభసా = ఆకాశము
చేతను, నభస్వతా = వాయువు చేతను, ఉష్ణరుచా
= సూర్యుని చేతను, ఆత్మనా + చ = యజమాని (ఆత్మ) చేతను,
యత్ = ఏ, జగత్ = జగత్తు, ధృతమ్ = ధరింపబడుచున్నదో, సః = అట్టి అష్టమూర్తి
స్వరూపము, తవ = నీ యొక్క, కరుణాయాః +
ఏవ = కరుణ యొక్క, మహిమా = మహిమయే.
తాత్పర్యము:
ఓ ఈశ్వరా! భూమి, ఆకాశం, నీరు, నిప్పు,
గాలి, సూర్యుడు, చంద్రుడు
మరియు యజమాని అనే అష్టమూర్తి స్వరూపంతో నీవు ఈ జగత్తును ధరించి రక్షిస్తున్నావు.
నీవు ఇన్ని రూపాలు ధరించి లోకాన్ని కాపాడటం అనేది నీ కరుణా మహిమే తప్ప వేరొకటి
కాదు.
విశేషములు:
పరమేశ్వరుని అష్టమూర్తి వైభవాన్ని కవి ఇక్కడ ఆయన కరుణకు నిదర్శనంగా పేర్కొన్నారు.
పన్నెండవ
శ్లోకము
శ్లోకము:
ప్రసాదినీం సహస్రాపోహితతాపసంపదమ్ । పావనీం
కరుణాతరంగిణీం ప్రతిపద్యే తవ దేవ పావనీమ్ ॥ 12 ॥
ప్రతిపదార్థము:
హే + దేవ = ఓ దైవమా (శివా), ప్రసాదినీమ్ = అనుగ్రహమును కురిపించునట్టియు
(నిర్మలమైనట్టియు), సహస్ర + అపోహిత + తాప + సంపదమ్ =
వెనువెంటనే తొలగింపబడిన ఆధ్యాత్మికాది తాపముల సమూహము గలదియు, పావనీమ్ = పవిత్రము చేయునదియు, తవ = నీ యొక్క,
కరుణా + తరంగిణీమ్ = కరుణ అనెడి నదిని, ప్రతిపద్యే
= శరణు వేడుచున్నాను.
తాత్పర్యము:
ఓ పరమేశ్వరా! నీ కరుణ ఒక పవిత్రమైన నది వంటిది. అది భక్తులపై అనుగ్రహాన్ని
కురిపిస్తూ, వారి సంసార తాపాలను వెనువెంటనే కడిగివేస్తుంది. అత్యంత నిర్మలమైన, పవిత్రమైన నీ కరుణా తరంగిణిని నేను శరణు వేడుతున్నాను.
విశేషములు:
ఇక్కడ శివ కరుణను నదితో పోల్చడమైనది. నది ఏ విధంగా తాపాన్ని హరించి శరీరమును
పవిత్రం చేస్తుందో, శివ కరుణ కూడా ఆధ్యాత్మిక తాపాలను హరించి ఆత్మను పవిత్రం
చేస్తుంది.
పదమూడవ
శ్లోకము
శ్లోకము:
ప్రణయేన చిరం ప్రసాదితా మదనాశాకులితేన చేతసా । తరుణీ
కరుణా కరోతి తే న కథం నాథ హృది స్థిరం పదమ్ ॥ 13 ॥
ప్రతిపదార్థము:
హే + నాథ = ఓ నాథా, మదన + ఆశా + కులితేన = అహంకారము (మదము) యొక్క నాశనముచేత
వ్యాకులత చెందిన (లేక మన్మథుని కోరికలచే నిండిన), చేతసా =
మనస్సుతో, ప్రణయేన = మిక్కిలి ప్రేమతో (ప్రార్థనతో), చిరమ్ = చిరకాలము, ప్రసాదితా = ఆరాధింపబడిన, తే = నీ యొక్క, తరుణీ = నిత్య నూతనమైన (యౌవనవతి
వంటి), కరుణా = కరుణ, హృది = (నీ)
హృదయమునందు, స్థిరమ్ = స్థిరమైన, పదమ్
= స్థానమును, కథమ్ + న + కరోతి = ఎందుకు ఏర్పరచుకోదు?
(తప్పక ఏర్పరచుకొంటుంది).
తాత్పర్యము:
ఓ నాథా! అహంకారాన్ని వదిలిపెట్టి, చిరకాలం భక్తితో ప్రార్థించే భక్తుని పట్ల
నీ కరుణకు నీ హృదయంలో స్థిరమైన చోటు దొరుకుతుంది. శ్లేషార్థంలో చెప్పాలంటే,
ప్రేమికుడు చిరకాలం అనునయించగా ప్రసన్నురాలైన ఒక తరుణి (యౌవనవతి)
అతని హృదయంలో ఎలా స్థిరస్థానం పొందుతుందో, నీ కరుణ కూడా నీ
మనసులో భక్తుల పట్ల అలాగే స్థిరంగా ఉంటుంది.
విశేషములు:
ఇక్కడ 'తరుణీ కరుణా' అనే పదబంధం ద్వారా కరుణను ఒక యువతితో
పోలుస్తూ కవి శ్లేషాలంకారాన్ని ఉపయోగించారు. భగవంతుని కరుణ భక్తునిపై ఎల్లప్పుడూ
నిలిచి ఉంటుందని దీని భావము.
పధ్నాల్గవ
శ్లోకము
శ్లోకము:
భుజగా ఇవ చందనద్రుమం గలపయంతో విషమా నయంతి మామ్ । ధృతిచ్ఛిదః
పరిహేయదశామరాతయో మదమానప్రముఖాః ॥ 14 ॥
ప్రతిపదార్థము:
మద + మాన + ప్రముఖాః = మదము, అహంకారము మొదలైన, ధృతి
+ చ్ఛిదః = ధైర్యమును (సుఖమును) నశింపజేయునట్టి, విషమాః =
భయంకరమైన, అరాతయః = (కామక్రోధాది) శత్రువులు, విషమ్ = గరళమును, గలపయంతః = గ్రక్కుచున్న, భుజగాః = పాములు, చందన + ద్రుమమ్ + ఇవ = చందన
వృక్షమును వలె, మామ్ = నన్ను, పరిహేయ +
దశామ = అందరూ వదిలివేసే (త్యాజ్యమైన) స్థితికి, నయంతి =
తీసుకొని వెళ్ళుచున్నారు.
తాత్పర్యము:
చందన వృక్షాన్ని విషపూరితమైన పాములు చుట్టుముట్టి, దానిని ఎవరూ దగ్గరకు రానివ్వని
స్థితికి ఎలా చేరుస్తాయో; అట్లే నాలోని మదమత్సరాది
అంతశ్శత్రువులు నా ధైర్యాన్ని హరించి, నన్ను అందరూ
అసహ్యించుకునే హీన స్థితికి దిగజారుస్తున్నారు.
విశేషములు:
ఇక్కడ మనిషిని చందన వృక్షంతోను, అంతశ్శత్రువులను పాములతోను పోల్చడం
జరిగింది. పాములు చుట్టిన చందనము ఏ విధంగా నిరుపయోగమవుతుందో, దుర్గుణములు ఉన్న మనిషి కూడా అలాగే పాడవుతాడని కవి ఆవేదన.
పదిహేనవ
శ్లోకము
శ్లోకము:
కరుణామరుణానుజన్మనస్తనుముచ్చైరివ పక్షపాతినీమ్ । సముపేమి
ధృతాచ్యుతశ్రియం శరణం భూధరపుత్రికాపతేః ॥ 15 ॥
ప్రతిపదార్థము:
భూధర + పుత్రికా + పతేః = పార్వతీపతియైన శివుని యొక్క, కరుణామ్ =
కరుణను, శరణమ్ = శరణుగా, సముపేమి =
పొందుచున్నాను. సా (కరుణా) = ఆ కరుణ, అరుణ + అనుజన్మనః =
అరుణుని తమ్ముడైన గరుత్మంతుని యొక్క, తనుమ్ + ఇవ = శరీరము
వలె ఉన్నది. ఉచ్చైః = మిక్కిలి, పక్షపాతినీమ్ = (భక్తులపై)
పక్షపాతము (ప్రేమ) కలిగినది (గరుడుని పక్షమున - రెక్కలతో ఎగిరేది), ధృత + అచ్యుత + శ్రియమ్ = స్థిరమైన (అచ్యుత) సంపదను ధరించినది (గరుడుని
పక్షమున - విష్ణువును మరియు లక్ష్మిని మోయునది).
తాత్పర్యము:
పార్వతీపతియైన పరమేశ్వరుని కరుణను నేను శరణు వేడుతున్నాను. ఆ కరుణ గరుత్మంతుని
శరీరము వలె ఉన్నది. గరుత్మంతుడు ఏ విధంగా తన రెక్కల (పక్షముల) సహాయంతో ఆకాశంలో
విహరిస్తూ విష్ణువును, లక్ష్మిని ధరిస్తాడో, శివుని కరుణ కూడా
భక్తులపై పక్షపాతము (ప్రేమ) కలిగి ఉండి, వారికి స్థిరమైన
మోక్షలక్ష్మిని ప్రసాదిస్తుంది.
విశేషములు:
ఇక్కడ కరుణకు మరియు గరుత్మంతునికి మధ్య శ్లేషాలంకారము ద్వారా పోలిక చెప్పబడింది. 'పక్షపాతము'
అనగా కరుణా పక్షమున 'ప్రేమ' అని, గరుడుని పక్షమున 'రెక్కలు'
అని అర్థము.
పదహారు, పదిహేడు
మరియు పద్దెనిమిదవ శ్లోకములు (తిలకము)
శ్లోకములు:
స్ఫురితారుణచారుచక్షుషా వపుషా నిర్భరఘర్మవిప్రుషా । పరుషాశయతాముపేయుషా
సరుషో యత్ప్రహరంతి యోషితః ॥ 16 ॥
భగవందృఢబద్ధమూలయోర్ద్విషతోరేష సహస్రశాఖయోః । అవిషహ్యనిపాతపీడయోరనుభావః
కుసుమేషురోషయోః ॥ 17 ॥
అనయోః కరుణైవ తావకీ నియతం మూలని కృంతనక్షమా । యమలార్జునయోరివోర్జితా శిఖలీలా
నరకాంతకారిణః ॥ 18 ॥
ప్రతిపదార్థము:
హే + భగవన్ = ఓ భగవంతుడా, స్ఫురిత + అరుణ + చారు + చక్షుషా = అదిరిపడుచున్న ఎర్రని
అందమైన కన్నులతో, నిర్భర + ఘర్మ + విప్రుషా = నిండిన చెమట
బిందువులతో, పరుష + ఆశయతామ్ = కఠినమైన స్వభావమును, ఉపేయుషా = పొందినట్టి, సరుషః = కోపముతో ఉన్నట్టి,
వపుషా = శరీరముతో, యోషితః = స్త్రీలు, యత్ + ప్రహరంతి = దేనినైతే కొట్టుచున్నారో (పీడించుచున్నారో), ఏషః = ఇది, దృఢ + బద్ధ + మూలయోః = గట్టిగా
పాతుకుపోయిన వేర్లు కలిగినట్టి, సహస్ర + శాఖయోః = వేలకొలది
శాఖలు కలిగినట్టి, అవిషహ్య + నిపాత + పీడయోః = భరించలేని
దెబ్బల వంటి బాధను ఇచ్చునట్టి, కుసుమేషు + రోషయోః = కామము
మరియు క్రోధము అనెడి, ద్విషతోః = ఇద్దరు శత్రువుల యొక్క,
అనుభావః = ప్రభావము. అనయోః = ఈ రెండింటిని, మూల
+ నికృంతన + క్షమా = వేళ్లతో సహా నరికివేయుటకు సమర్థమైనది, తావకీ
= నీదైన, కరుణా + ఏవ = కరుణయే. ఇయం (కరుణా) = ఈ కరుణ,
నరకాంతకారిణః = నరకాసురుని చంపిన విష్ణువు యొక్క, ఊర్జితా = ప్రకాశవంతమైన, శిఖ + లీలా + ఇవ =
చిన్ననాటి బాల్య లీల వలె, యమలార్జునయోః = యమలార్జున
వృక్షములను కూల్చినట్లుగా (ఉన్నది).
తాత్పర్యము:
ఓ భగవంతుడా! ఎర్రబడిన కన్నులతో, స్వేద బిందువులతో, కఠిన
మనసుతో స్త్రీల పట్ల మోహము చెందడం లేదా క్రోధముతో ప్రవర్తించడం ఇదంతా కామక్రోధాల
ప్రభావమే. ఇవి లోతైన వేర్లు, అనేక శాఖలు కలిగి భరించలేని
పీడను కలిగించే మహా వృక్షాల వంటి శత్రువులు. ఈ కామక్రోధాలనే వృక్షాలను వేళ్లతో సహా
నరికివేయడానికి నీ కరుణ ఒక్కటే సమర్థమైనది. బాలకృష్ణుడు ఏ విధంగా తన బాల్య లీలతో
గట్టిగా పాతుకుపోయిన యమలార్జున వృక్షాలను కూల్చివేసాడో, నీ
కరుణ కూడా నాలోని ఈ వికారాలను అలాగే అంతం చేస్తుంది.
విశేషములు:
కామక్రోధాలను పెరిగిపోయిన వృక్షాలతోను, వాటిని తొలగించే శివకరుణను కృష్ణుని
లీలతోను పోల్చడం ఇందలి విశేషము. ఎంతటి దృఢమైన పాపపు వేర్లనైనా శివకరుణ
కూకటివేళ్లతో సహా తొలగించగలదని భావము.
పందొమ్మిది, ఇరవై మరియు
ఇరవై ఒకటవ శ్లోకములు (తిలకము)
శ్లోకములు: న విధిర్విధిధామసంశ్రితొ న వినోదో మృగనాభిసంభవః । న చ
శారదచంద్రచంద్రికా న కలం కోకిలకంఠకూజితమ్ ॥ 19 ॥
న శిశోరసమంజసం వచో న మృగాక్షీపరిరంభవిభ్రమః । మధురా న కవీంద్రభారతీ న చ
సామ్రాజ్యవిభూతిజృంభితమ్ ॥ 20 ॥
న రసాయనపానకౌతుకం న చ శక్రాసనవాసవాసనా । పరిపూరయితుం క్షమేత తే కరుణాయా హర
షోడశీం కలామ్ ॥ 21 ॥
ప్రతిపదార్థము:
హే + హర = ఓ పాపహరుడవైన శివా, తే = నీ యొక్క, కరుణాయాః
= కరుణా రసములోని, షోడశీమ్ + కలామ్ = పదహారవ వంతును (అతి
స్వల్ప భాగాన్ని) కూడా, పరిపూరయితుమ్ = సరితూచుటకు (లేక
సమానమగుటకు), ఇవి ఏవీ క్షమేత + న = సమర్థము కావు. అవి ఏవనగా:
- విధిధామ + సంశ్రితః +
విధిః = బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించే యజ్ఞాది విధులు.
- మృగనాభి + సంభవః +
వినోదః = కస్తూరి వల్ల కలిగే పరిమళ భరిత ఆనందము.
- శారద + చంద్ర +
చంద్రికా = శరదృతువు నాటి నిండు వెన్నెల.
- కలమ్ + కోకిల + కంఠ +
కూజితమ్ = కోకిల గొంతు నుండి వచ్చే మధురమైన కూతలు.
- శిశోః + అసమంజసమ్ + వచః
= చిన్నపిల్లలు పలికే ముద్దు ముద్దు అమాయకపు మాటలు.
- మృగాక్షీ + పరిరంభ +
విభ్రమః = లేడికన్నుల సుందరి కౌగిలిలో కలిగే విలాసము.
- మధురా + కవీంద్ర +
భారతీ = మహాకవుల నోట వెలువడే తియ్యని కావ్యవాక్కు.
- సామ్రాజ్య + విభూతి +
జృంభితమ్ = సకల చక్రవర్తిత్వ వైభవము యొక్క విస్తృతి.
- రసాయన + పాన + కౌతుకమ్
= జరామరణాలను పోగొట్టే అమృతమును (రసాయనము) త్రాగాలనే ఉత్సాహము.
- శక్రాసన + వాస + వాసనా
= ఇంద్రుని సింహాసనంపై కూర్చోవాలనే కోరిక.
తాత్పర్యము:
ఓ హరా! నీ కరుణ వల్ల కలిగే ఆనందం ముందు ఈ లోకంలోని ఏ సుఖాలూ సాటిరావు. బ్రహ్మపదవి, కస్తూరి
పరిమళం, శరన్నవమి వెన్నెల, కోకిల గానం,
పసిపిల్లల మాటలు, సుందరీమణి కౌగిలి, మహాకవుల కవిత్వం, అఖండ సామ్రాజ్య వైభవం, చిరకాలం బ్రతికించే రసాయనం, చివరకు ఇంద్ర పదవి కూడా
నీ కరుణలో పదహారవ వంతుకు (ఒక్క కళకు) కూడా సరితూగవు. నీ కృప వల్ల లభించే శాంతి
సాటిలేనిది.
ఇరవై
రెండవ శ్లోకము
శ్లోకము:
సురభిర్న మమ స్పృహాస్పదం సురభిర్దక్షిణమారుతోऽపి వా । సురభిక్షు వితీర్ణవాంఛితా సురభిర్న కరుణా యథా తవ ॥ 22 ॥
ప్రతిపదార్థము:
హే + విభో = ఓ ప్రభూ, తవ = నీ యొక్క, కరుణా + యథా = కరుణ ఏ
విధంగానైతే (నాకు ఇష్టమో), తథా = ఆ విధంగా, సురభిః = వసంత కాలము, మమ = నాకు, స్పృహాస్పదమ్ + న = కోరదగినది కాదు. సురభిః + దక్షిణమారుతః + అపి + వా =
సుగంధభరితమైన మలయ మారుతము (గాలి) కూడా నాకు ఇష్టం లేదు. సురభిక్షు = దేవతలనే
యాచకులకు (సుర + భిక్షు), వితీర్ణ + వాంఛితా = కోరినవన్నీ
ఇచ్చేటట్టి, సురభిః = కామధేనువు (సురభి) కూడా, తవ + కరుణా + యథా = నీ కరుణ వలె (నాకు తృప్తిని ఇవ్వలేదు).
తాత్పర్యము:
ఓ స్వామీ! నీ కరుణపై నాకు ఉన్నంత ఆసక్తి వసంత కాలం పైన గానీ, చల్లని మలయ
మారుతం పైన గానీ లేదు. దేవతల కోరికలన్నీ తీర్చే 'సురభి'
(కామధేనువు) కూడా నీ కరుణ ఇచ్చే ఆనందాన్ని ఇవ్వలేదు. నాకు నీ కరుణ
ఒక్కటే పరమార్థము.
విశేషములు:
ఇక్కడ 'సురభి' అనే పదానికి వసంతము, సుగంధము,
కామధేనువు అని మూడు అర్థాలను వాడుతూ శ్లేషాలంకారము ద్వారా శివకరుణ
యొక్క ప్రాముఖ్యతను కవి చాటిచెప్పారు.
ఇరవై
మూడు మరియు ఇరవై నాలుగవ శ్లోకములు (యుగ్మకము)
శ్లోకములు:
సముదేతి యదశ్రు శోకజం రుచిరానందమయం విభాతి తత్ । పులకః
ప్రథతే భయేన యః స చమత్కారకృతః ప్రవర్తతే ॥ 23 ॥
శ్రమజం హృది యన్నిమీలనం పరమార్థానుభవాదుదేతి తత్ । శరణం కరుణాముపేయుషాం
కృతినాం చంద్రకిరీట తావకీమ్ ॥ 24 ॥
ప్రతిపదార్థము:
హే + చంద్రకిరీట = ఓ చంద్రుని కిరీటముగా ధరించిన శివా, తావకీమ్ =
నీదైన, కరుణమ్ = కరుణను, శరణమ్ +
ఉపేయుషామ్ = శరణు వేడిన, కృతినామ్ = ధన్యులైన భక్తులకు,
శోకజమ్ = (సంసార) దుఃఖము వల్ల, యత్ + అశ్రు =
ఏ కన్నీరు, సముదేతి = కలుగుచున్నదో, తత్
= అది, రుచిర + ఆనందమయమ్ = సుందరమైన ఆనంద బాష్పముగా, విభాతి = ప్రకాశించును. భయేన = (జన్మ మృత్యు) భయముచేత, యః + పులకః = ఏ రోమాంచము (గగుర్పాటు), ప్రథతే =
కలుగునో, సః = అది, చమత్కారకృతః =
భక్తి రసము వల్ల కలిగే అద్భుత గగుర్పాటుగా, ప్రవర్తతే =
మారును. శ్రమజమ్ = సంసార భ్రమణము వల్ల కలిగే అలసట చేత, హృది
= హృదయమునందు, యత్ + నిమీలనమ్ = ఏ (కళ్లు) మూతబడుట (నిరాశ)
కలుగునో, తత్ = అది, పరమార్థ +
అనుభవాత్ = తత్త్వజ్ఞాన అనుభవము వల్ల కలిగే ధ్యానముగా, ఉదేతి
= ఆవిర్భవించును.
తాత్పర్యము:
ఓ చంద్రశేఖరా! నీ కరుణను శరణువేడిన భక్తుల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది.
లోకరీత్యా వారు కార్చే దుఃఖ బాష్పాలు నీ కృప వల్ల ఆనంద బాష్పాలుగా మారిపోతాయి.
సంసార భయంతో కలిగే గగుర్పాటు, నీ భక్తి వల్ల కలిగే అద్భుత పులకరింతగా
మారుతుంది. లోకకష్టాల వల్ల కలిగే అలసటతో వారు కళ్లు మూసుకుంటే, అది నీ తత్త్వ ధ్యానంలో కలిగే సమాధి స్థితిగా మారుతుంది. అంటే నీ కరుణా
ప్రభావం వల్ల లౌకిక దుఃఖాలన్నీ అలౌకికానందాలుగా రూపాంతరం చెందుతాయి.
ఇరవై
ఐదవ శ్లోకము
శ్లోకము: భజతః సరేళేవ భారతీ నరకం కాలకృతగ్రహస్య మే । కరుణా
ప్రథతామయముమాపతే కలికాలాంఛితవిగ్రహస్య తే ॥ 25 ॥
ప్రతిపదార్థము:
హే + ఉమాపతే = ఓ పార్వతీపతీ, నరకమ్ + భజతః = (పాపముల వల్ల) నరకమును
పొందుచున్నట్టియు, కాల + కృత + గ్రహస్య = మృత్యువు (కాలము)
చేత పట్టుకోబడినట్టి, మే = నా యొక్క, భారతీ
= వాక్కు, సరళా + ఇవ = స్పష్టమైనదియు, సాధువైనదియుగా,
ప్రథతామ్ = ప్రకాశించుగాక. కలికాల + అంఛిత + విగ్రహస్య = కలికాలము
వలె భయంకరమైన విగ్రహము (శరీరము) గలవాడనైన నాపై, తే = నీ
యొక్క, కరుణా = కరుణ, ప్రథతామ్ =
విస్తరించుగాక.
శ్లేషార్థము
(శివుని పక్షమున): నర + కంకాల + కృత + గ్రహస్య = మనుష్యుల ఎముకల గూడును (కపాలమును)
ధరించినవాడవును, కలికలా + అంఛిత + విగ్రహస్య = చంద్రుని కళ (కలికల) చేత
అలంకరించబడిన దేహము కలవాడవును అయిన ఓ శివా! నీ కరుణ నాపై ప్రసరించుగాక.
తాత్పర్యము:
ఓ ఉమాపతీ! నేను పాపిని, నరకానికి అర్హుడను, మృత్యువుకు
చిక్కినవాడను. అట్టి నా వాక్కు నీ స్తుతి యందు నిమగ్నమై పవిత్రము కావాలి.
నరకపాలధారివై, చంద్రకళాధారివైన నీ కరుణ నా వంటి దీనునిపై
ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఇరవై
ఆరు నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకములు (చక్రకము)
శ్లోకములు: భగవన్మదిరామదోన్మదప్రమదాపాంగతరంగభంగరమ్ । జరసా తరసావసాదితం
వపురాయాతి న యావదాపదమ్ ॥ 26 ॥
కుపితాంతకకింకరేరితః కుటిలాం తద్భ్రుకుటి విడంబయన్ । న ఘనాంజనపుంజసన్నిభో
భుజగో యావదుపేతి కంధరామ్ ॥ 27 ॥
న కుకర్మవిపాకకల్పితా నరకే యావదుదేతి వేదనా । గదితా శమనానుగామిభిః పరుషా గీరివ
మర్మభేదినీ ॥ 28 ॥
యది తావదియం న గాహతే హృదయం తే కరుణాతరంగిణీ । వద దుఃసహతాపసంపదామితరా కా
శరణార్థినాం గతిః ॥ 29 ॥
ప్రతిపదార్థము:
హే + భగవన్ = ఓ షడ్గుణైశ్వర్య సంపన్నుడా, మదిరా + మద + ఉన్మద = మద్యపానముతో
మత్తుకెక్కిన, ప్రమదా = యువతి యొక్క, అపాంగ
+ తరంగ = కడకంటి చూపుల అలల వలె, భంగురమ్ = అస్థిరమైనదియు,
జరసా = ముసలితనము చేత, తరసా = వేగముగా
(బలముగా), అవసాదితమ్ = కృశించిపోయినదియు అయిన, (మమ) వపుః = నా యొక్క శరీరము, యావత్ = ఎంతలోపు,
ఆపదమ్ = నాశనమును, న + ఆయాతి = పొందదో;
కుపిత + అంతక + కింకర + ఈరితః = కోపించిన యమదూతచే ప్రేరేపించబడిన,
తత్ + భ్రుకుటిమ్ = ఆ యమదూత బొమముడిని, విడంబయన్
= పోలియున్నట్టియు, ఘన + అంజన + పుంజ + సన్నిభః = దట్టమైన
కాటుక రాశి వలె నల్లగా ఉన్న, భుజగః = (యమపాశము అనెడి) పాము,
యావత్ = ఎంతలోపు, కంధరామ్ = నా గొంతును,
న + ఉపేతి = చుట్టుకోదో; కుకర్మ + విపాక +
కల్పితా = చెడు కర్మల ఫలితముగా కలిగే, మర్మభేదినీ =
మర్మములను భేదించే, నరకే = నరకమునందు, వేదనా
= బాధ, యావత్ = ఎంతలోపు, న + ఉదేతి =
పుట్టదో; శమన + అనుగామిభిః = యముని బంట్ల చేత, పరుషా = కఠినముగా, గదితా = పలకబడిన, గీః + ఇవ = మాట వలె; హే విభో = ఓ స్వామీ, తావత్ = అంతలోపు, తే = నీ యొక్క, ఇయమ్ = ఈ, కరుణా + తరంగిణీ = కరుణ అనెడి నది,
తే + హృదయమ్ = నీ హృదయమును, యది + న + గాహతే =
ఒకవేళ ప్రవేశించకపోతే (నాపై దయ కలగకపోతే), దుఃసహ + తాప +
సంపదామ్ = భరించలేని తాపములతో నిండిన, శరణార్థినామ్ = నిన్ను
శరణు వేడుతున్న మా వంటి వారికి, ఇతర + కా + గతిః = వేరే గతి
ఏమున్నది? (ఏమీ లేదు).
తాత్పర్యము:
ఓ భగవంతుడా! నా శరీరం మద్యంతో మత్తుకెక్కిన యువతి కడకంటి చూపుల వలె అత్యంత
అస్థిరమైనది. ముసలితనం నా దేహాన్ని కృశింపజేస్తోంది. మృత్యువు ఏ క్షణానైనా దాడి
చేయవచ్చు. కోపించిన యమదూతలు నల్లని పాము వంటి పాశాన్ని నా మెడకు బిగించకముందే, నా పాపకర్మల
వల్ల కలిగే భయంకరమైన నరకయాతనలు నన్ను చుట్టుముట్టకముందే, యమకింకరుల
కఠిన వాక్కులు నా మర్మాలను భేదించకముందే... నీ కరుణా తరంగిణి నీ హృదయంలో కదిలి
నాపై ప్రసరించాలి. ఒకవేళ నీవే నన్ను కరుణించకపోతే, ఈ దుర్భర
సంసార తాపాలతో అలమటించే మా వంటి శరణార్థులకు అండ ఎవరు? నీవే
మా ఏకైక గతివి.
విశేషములు:
వ్యాఖ్యానమునందు వివరించినట్లుగా, ప్రాణం పోయే లోపు భగవంతుని కరుణను
సంపాదించుకోవాలనే ఆర్తి ఇక్కడ కనిపిస్తుంది. యమపాశాన్ని నల్లని పాముతో పోల్చడం
ద్వారా మృత్యువు యొక్క భయానకతను కవి చిత్రించారు.
ముప్పైయవ
శ్లోకము
శ్లోకము:
న సమానసమాగమా తథా ప్రమదాయ ప్రమదా యతాత్మనామ్ । శివదా
శివదాస్యకృద్యథా స్వదమానసదమానఘా మతిః ॥ 30 ॥
ప్రతిపదార్థము:
యతాత్మనామ్ = ఇంద్రియాలను జయించిన యోగులకు, శివదా = మోక్షమును (కైవల్యమును) ఇచ్చునదియు,
శివ + దాస్య + కృత్ = పరమేశ్వరుని సేవ యందు నిమగ్నమై ఉండునదియు,
స్వ + దమానస + దమ + అనఘా = తన మనస్సును నిగ్రహించుకొనునట్టి
నిర్మలమైన, మతిః = బుద్ధి, యథా = ఏ
విధంగానైతే, ప్రమదాయ = పరమానందమును కలిగించునో; సమాన + సమాగమా = గౌరవప్రదమైన కలయిక గల, ప్రమదా =
యవ్వనవతియైన స్త్రీ, తథా = ఆ విధంగా, న
(భవతి) = ఆనందమును కలిగించలేదు.
తాత్పర్యము:
జితేంద్రియులైన భక్తులకు శివకైంకర్యమునందు నిమగ్నమైన బుద్ధి కలిగించే ఆనందం
సాటిలేనిది. తన మనస్సును అదుపులో ఉంచుకొని, శివుని సేవలోనే తరించాలనే నిర్మలమైన బుద్ధి
ఇచ్చే మోక్షానందం ముందు, లోకంలోని సుందరవతుల సాంగత్యం వల్ల
కలిగే ఆనందం ఏమాత్రం సరితూగదు.
విశేషములు:
ఇక్కడ 'ప్రమదా' (స్త్రీ) మరియు 'ప్రమదాయ'
(ఆనందము కొరకు) అనే పదాల చమత్కారముతో భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక
సుఖమే మిన్న అని చెప్పబడింది.
ముప్పై
ఒకటవ శ్లోకము
శ్లోకము:
ఏకః పురంధరపురం దరవేహితభూః కిముజ్జంగమజనం
గమయేన్మహర్షిః । కిం తామసం పదమసంపదమింద్రమన్యో ధన్యోదయా భవ దయా భవతో న చేత్స్యాత్
॥ 31 ॥
ప్రతిపదార్థము:
హే భవ = ఓ శివా, భవతః = నీ యొక్క, ధన్య + ఉదయా = ధన్యమైన
ఫలితములను ఇచ్చునట్టి, దయా = కరుణ, న +
చేత్ + స్యాత్ = లేకపోయినట్లయితే; ఏకః = ఒకానొక, మహర్షిః = మహర్షి (విశ్వామిత్రుడు), దరవేహితభూః =
భయము చేత కనుబొమలు కదిలినవాడై, జనం గమజనమ్ = చండాలత్వాన్ని
పొందిన త్రిశంకువును, పురంధరపురమ్ = ఇంద్రలోకమునకు
(స్వర్గమునకు), కిమ్ + గమయేత్ = ఎలా పంపగలిగేవాడు?, అన్యో = మరొక మహర్షి (గౌతముడు), ఇంద్రమ్ = ఇంద్రుని,
అసంపదమ్ = వైభవం లేనివానినిగా, తామసమ్ + పదమ్
= అంధకారమయమైన (నింద్యమైన) స్థితిని, కిమ్ + గమయేత్ = ఎలా
పొందింపగలిగేవాడు?
తాత్పర్యము:
ఓ శంభూ! నీ కరుణ లేకపోతే మహర్షులకు అంతటి సామర్థ్యం ఎక్కడిది? నీ కరుణా
ప్రభావం చేతనే కదా - విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో చండాల రూపము పొందిన
త్రిశంకువును సశరీరముగా స్వర్గానికి పంపగలిగాడు. అలాగే గౌతమ మహర్షి అహల్య విషయంలో
ఇంద్రుడిని శపించి, అతని వైభవాన్ని హరించి అవమానకరమైన
స్థితికి గురిచేయగలిగాడు. ఇదంతా నీ కరుణా శక్తి వల్ల వారికి లభించిన తపఃప్రభావమే
తప్ప వారి సొంతం కాదు.
విశేషములు
(వ్యాఖ్యానమునందలి పురాణ గాథలు):
- త్రిశంకువు కథ: త్రిశంకువు
సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని కోరగా, వసిష్ఠుడు నిరాకరించి శపించడంతో అతను
చండాల రూపం పొందుతాడు. విశ్వామిత్రుడు తన తపస్సుతో అతడిని స్వర్గానికి
పంపిస్తాడు.
- అహల్య-ఇంద్రుని కథ: ఇంద్రుడు
అహల్యపై మోహంతో గౌతముడి రూపంలో రాగా, మహర్షి ఆగ్రహించి ఇంద్రుడి శరీరంపై
వేయి యోనులు (తర్వాత కళ్లుగా మారినవి) ఏర్పడేలా శపించాడు. ఈ గాథల ద్వారా
భగవంతుని కరుణ వల్లనే మహర్షులకు సృష్టిని మార్చగల లేదా శిక్షించగల శక్తి
లభిస్తుందని కవి వర్ణించారు.
ముప్పై
రెండవ శ్లోకము
శ్లోకము: ఆర్ద్రం మనస్యుదితమార్తజనోపతాప- సంపర్కతోऽథ హృది కందళితం శుభాయామ్ । వాచి క్షణాత్కుసుమితం ఫలితం చ
కృత్యే కారుణ్యబీజమజరం జయతీందుమౌళేః ॥ 32 ॥
ప్రతిపదార్థము:
ఆర్తజన + ఉపతాప + సంపర్కతః = దుఃఖితులైన జనుల యొక్క కష్టములను చూసినంతనే (సంపర్కము
చేత), ఇందుమౌళేః = చంద్రశేఖరుడైన శివుని యొక్క, మనసి =
మనస్సునందు, ఆర్ద్రమ్ = ద్రవించినదై (తడిసినదై), ఉదితమ్ = ఉదయించినట్టియు; అథ = అటుపిమ్మట, హృది = హృదయమునందు, కందళితమ్ = అంకురించినట్టియు;
శుభాయామ్ + వాచి = శుభప్రదమైన (అభయ) వాక్కునందు, క్షణాత్ = క్షణకాలమునందే, కుసుమితమ్ =
పుష్పించినట్టియు; కృత్యే = (భక్త రక్షణ అనెడి) కార్యమునందు,
ఫలితమ్ + చ = ఫలించినట్టియు; అజరమ్ =
ముసలితనము లేని (శాశ్వతమైన), కారుణ్య + బీజమ్ = కరుణ అనెడి
బీజము, జయతి = సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నది.
తాత్పర్యము:
చంద్రశేఖరుడైన పరమేశ్వరుని కరుణ ఒక విలక్షణమైన బీజం వంటిది. భక్తుల కష్టాలను
చూసినప్పుడు ఆ బీజం ఆయన మనస్సులో దయతో తడిసి మొలకెత్తుతుంది. ఆయన హృదయంలో అది
అంకురిస్తుంది. ఆయన పలికే "భయపడకు" అనే శుభ వాక్కులలో అది పువ్వులు
పూస్తుంది. చివరకు భక్తుల ఆపదలను తొలగించే రక్షణ కార్యంలో అది పండుగా మారుతుంది.
ఇటువంటి అద్భుతమైన, శాశ్వతమైన శివుని కారుణ్య బీజం అన్నిటికంటే గొప్పది.
వ్యాఖ్యానము:
ఈ శ్లోకముతో శివ కరుణ ఏ విధంగా అంకురం నుండి ఫలం వరకు ఎదుగుతుందో కవి చాలా అందంగా
వర్ణించారు. భగవంతుని దయ అనేది కేవలం భావం కాదు, అది భక్తుడిని కాపాడే కార్యం
వరకు సాగే ఒక నిరంతర ప్రక్రియ అని ఇక్కడ స్పష్టమవుతోంది.
ముప్పై
మూడు నుండి ముప్పై ఆరవ శ్లోకములు (అంతిమ దశ వర్ణన)
శ్లోకములు:
రోగైరుగ్రైరఖిలవిగళత్సౌష్ఠవో నష్టచేష్టః పర్యస్తాంగోऽశుచిని శయనే మగ్నసర్వాభ్యుపాయః । యావజ్జీవం విహితమహితం కర్మ
కర్తవ్యమూఢః స్మృత్వా స్మృత్వా దళితహృదయః కాతరః కాందిశీకః ॥ 33 ॥
తృష్ణోత్కర్షాత్కటుషు పరుషైః కర్మభిః శర్మహృద్భి- ర్యత్సంప్రాప్తం కథమపి ధనం
క్లేశయిత్వా శారీరమ్ । రిక్థగ్రాహైర్ద్రవిణమఖిలం తుండ్యమానం తదగ్రే పశ్యన్నశ్యత్సకలకరణో
దహ్యమానః శుచాంతః ॥ 34 ॥
శోకోద్రేకానవిరళగళద్బాష్పపూర్ణేక్షణాభిః సత్పత్నీభిశ్చకితచకితం
లోచనైరీక్ష్యమాణః । పుత్రైర్మిత్రైః సహజసచివైర్బంధుభిస్తద్వగై- రాక్రందద్భిః
కరుణకరుణైః పీడ్యమానః ప్రపన్నః ॥ 35 ॥
స్వస్థావస్థైరశమమశుచితాశంకిభిర్దూరమగ్న్యా- దంతర్లీనస్మృతిరపి హఠాదనిష్ఠురైః
కృష్యమాణః । యస్మిన్కాలే కవళితవపుర్మృత్యునాభ్యేతి భీతిం తత్ర త్రాతా క ఇవ
కరుణామీశ్వరీమంతరేణ ॥ 36 ॥
ప్రతిపదార్థము:
ఉగ్రైః + రోగైః = భయంకరమైన వ్యాధులచేత, అఖిల + విగళత్ + సౌష్ఠవః = శరీర పటుత్వమంతా
నశించినవాడును; నష్టచేష్టః = కదలికలు లేనివాడును; అశుచిని + శయనే = అపవిత్రమైన శయ్యపై, పర్యస్తాంగః =
పడవేసిన అవయవములు కలవాడును; యావజ్జీవమ్ = బ్రతికినంత కాలము,
విహితమ్ = చేసినట్టి, అహితమ్ + కర్మ = పాప
కర్మలను, స్మృత్వా + స్మృత్వా = తలచుకొని తలచుకొని, దళిత + హృదయః = బద్దలైన హృదయము కలవాడును; కాందిశీకః
= భయముతో ఏ దిక్కుకు వెళ్లాలో తెలియనివాడును; తృష్ణ +
ఉత్కర్షాత్ = మిక్కిలి ఆశతో, కటుషు + పరుషైః = కఠినమైన పనుల
ద్వారా, శారీరమ్ + క్లేశయిత్వా = శరీరాన్ని కష్టపెట్టి,
సంప్రాప్తమ్ = సంపాదించిన, అఖిలమ్ + ద్రవిణమ్
= సమస్త ధనమును, తత్ + అగ్రే = తన కళ్ళ ముందే, రిక్థగ్రాహైః = వారసుల చేత, తుండ్యమానమ్ =
పంచుకోబడుటను (దోచుకోబడుటను), పశ్యన్ = చూస్తున్నవాడును;
శుచా + అంతః + దహ్యమానః = లోలోపల శోకముతో దహించబడుతున్నవాడును;
అశ్రుపూర్ణ + ఈక్షణాభిః = కన్నీరు నిండిన కళ్ళు గల, సత్పత్నీభిః = పతివ్రతలైన భార్యల చేత, చకితచకితమ్ =
దీనముగా, ఈక్ష్యమాణః = చూడబడుతున్నవాడును; ఆక్రందద్భిః = ఏడుస్తున్న, పుత్ర + మిత్ర + బంధుభిః
= కొడుకులు, స్నేహితులు మరియు చుట్టాల యొక్క, కరుణ + కరుణైః = మిక్కిలి కరుణాకరమైన ధ్వనులచే, పీడ్యమానః
= పీడించబడుతున్నవాడును; యస్మిన్ + కాలే = ఏ సమయంలోనైతే,
మృత్యునా = మృత్యువు చేత, కవళిత + వపుః =
మింగబడిన శరీరము కలవాడై, భీతిమ్ + అభ్యేతి = భయాన్ని
పొందుతాడో; తత్ర = ఆ సమయంలో, ఈశ్వరీమ్
+ కరుణామ్ + అంతరేణ = ఈశ్వరుని కరుణ తప్ప, త్రాతా + కః + ఇవ
= రక్షించేవారు ఇంకెవరున్నారు? (ఎవరూ లేరు).
తాత్పర్యము:
మనిషి అంతిమ దశలో ఉన్నప్పుడు భయంకరమైన వ్యాధులు అతడిని చుట్టుముడతాయి. శరీరంపై
స్వాధీనం తప్పుతుంది. అపవిత్రమైన శయ్యపై కదలలేక పడి ఉంటాడు. తాను జీవితాంతం చేసిన
పాపాలను తలచుకొని మనసు వికలమై, ఏ దిక్కుకు వెళ్లాలో తెలియక భయపడతాడు. తాను
ఎంతో కష్టపడి ఆశతో సంపాదించిన ధనాన్ని తన కళ్ళ ముందే వారసులు పంచుకుంటుంటే చూసి
లోలోపల కుమిలిపోతాడు. భార్య, పుత్రులు, మిత్రులు చుట్టూ చేరి ఏడుస్తుంటే వారి రోదనలు అతడిని మరింత బాధ పెడతాయి.
మృత్యువు అతడిని కబళించే ఆ భయానక సమయంలో, ఆ పరమేశ్వరుని కరుణ
తప్ప మరేదీ అతడిని కాపాడలేదు.
విశేషములు:
ఈ శ్లోకములలో కవి మానవ జీవితం యొక్క అశాశ్వతతను, మృత్యువు యొక్క అనివార్యతను
కళ్లకు కట్టినట్లు చిత్రించారు. సంసార బంధాలు, సంపాదించిన
ధనం అంతిమ క్షణంలో పనికిరావని, కేవలం భగవంతుని కృప మాత్రమే
దిక్కని సందేశాన్ని ఇచ్చారు.
ముప్పై
ఏడవ శ్లోకము
శ్లోకము: వపుఃఖండే ఖండః ప్రతివసతి శైలేంద్రదుహితుః శిఖండం ఖండేందుః సకలమపి
విభుః ఖండపరశుః । తథాపి ప్రత్యగ్రం శరణముపయాతం ప్రతి విభో- రఖండో వ్యాపారో జగతి
కరుణాయా విజయతే ॥ 37 ॥
ప్రతిపదార్థము:
విభోః = పరమేశ్వరుని యొక్క, వపుః + ఖండే = శరీరములోని ఒక భాగమున (సగభాగమున), శైలేంద్ర + దుహితుః = పర్వతరాజ పుత్రికయైన పార్వతి యొక్క, ఖండః = భాగము, ప్రతివసతి = నివసించుచున్నది; శిఖండమ్ = శిఖ (జటాజూటము) నందు, ఖండ + ఇందుః = ఖండ
చంద్రుడు (అర్ధచంద్రుడు) ఉన్నాడు; విభుః = ఆ స్వామి, స్వయమ్ + అపి = తాను కూడా, ఖండపరశుః = ఖండపరశువు
(పరశురామునితో యుద్ధమున విరిగిన గొడ్డలి కలవాడు); తథా + అపి
= అయినప్పటికీ, జగతి = లోకమునందు, ప్రత్యగ్రమ్
= అప్పుడే, శరణమ్ + ఉపయాతమ్ = శరణు కోరిన భక్తుని, ప్రతి = పట్ల, విభోః = ఆ విభుని యొక్క, కరుణాయాః = కరుణ యొక్క, అఖండః = పరిపూర్ణమైన (ఖండము
లేని), వ్యాపారః = పని/ప్రభావము, విజయతే
= సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నది.
తాత్పర్యము:
ఆశ్చర్యం ఏమిటంటే, శివుని శరీరంలో సగభాగం పార్వతిది (అర్ధనారీశ్వర రూపం),
ఆయన తలపై ఉన్నది అర్ధచంద్రుడు (ఖండచంద్రుడు), ఆయన
ఆయుధం కూడా విరిగిన గొడ్డలి (ఖండపరశువు). ఇలా అంతా 'ఖండము'
(ముక్కలు లేదా భాగాలు) గా ఉన్నప్పటికీ, తనను
శరణువేడిన భక్తుని రక్షించే విషయంలో ఆయన చూపే 'కరుణ' మాత్రం 'అఖండము' (పూర్ణమైనది).
భక్తుల పట్ల ఆయన కృపలో ఎటువంటి తక్కువతనము లేదా విభజన ఉండదు.
విశేషములు:
ఇక్కడ 'ఖండ' (భాగము) మరియు 'అఖండ'
(పూర్ణము) అనే పదాల విరోధాభాస అలంకారంతో శివకరుణ యొక్క గొప్పతనాన్ని
కవి చాటిచెప్పారు.
ముప్పై
ఎనిమిదవ శ్లోకము
శ్లోకము: జయ జితామయ జయ సుధామయ జయ ధృతామృతదీధితే జయ హతాంధక జయ పురాంతక జయ
కృతాంతకసంహృతే । జయ పరాపర జయ దయాపర జయ నతార్పితసద్గతే జయ జితస్మర జయ మహేశ్వర జయ జయ
త్రిజగత్పతే ॥ 38 ॥
ప్రతిపదార్థము:
- జితామయ: (జన్మ
మృత్యువులనెడి) రోగములను జయించినవాడా! నీకు జయము.
- సుధామయ: అమృత
స్వరూపుడా! (పరమానంద స్వరూపుడా!) నీకు జయము.
- ధృతామృతదీధితే: అమృత
కిరణుడైన చంద్రుని ధరించినవాడా! నీకు జయము.
- హతాంధక: అంధకాసురుని
సంహరించినవాడా! నీకు జయము.
- పురాంతక: త్రిపురాసురులను
అంతమొందించినవాడా! నీకు జయము.
- కృతాంతకసంహృతే: మృత్యువునే
(యముడినే) సంహరించినవాడా! నీకు జయము.
- పరాపర: బ్రహ్మాదుల కంటే
గొప్పవాడా! నీకు జయము.
- దయాపర: కరుణా
సముద్రుడా! నీకు జయము.
- నతార్పితసద్గతే: నమస్కరించిన
భక్తులకు సద్గతిని (మోక్షమును) ప్రసాదించువాడా! నీకు జయము.
- జితస్మర: మన్మథుని
జయించినవాడా! నీకు జయము.
- మహేశ్వర: ఓ మహేశ్వరా!
నీకు జయము.
- త్రిజగత్పతే: ముల్లోకాలకు
ప్రభువైనవాడా! నీకు జయము.
తాత్పర్యము:
ఓ పరమేశ్వరా! నీవు జరామరణాలను జయించిన వాడవు, అమృత స్వరూపుడవు, చంద్రశేఖరుడవు.
అంధకాసుర, త్రిపురాసుర సంహారకుడవు. భయంకరమైన మృత్యువును కూడా
శాసించగలవాడవు. సర్వోత్కృష్టమైన కరుణా మూర్తివి. నిన్ను శరణువేడిన భక్తులకు ఉత్తమ
గతులను కల్పిస్తావు. కామ దహనుడవు, ముల్లోకాల నాథుడవైన నీకు
ఇవే మా జయజయధ్వానాలు.
ముప్పై
తొమ్మిదవ శ్లోకము
శ్లోకము: స్థానాస్థాననియంత్రణవిరహితో నిర్హేతురప్రార్థితః సత్యం
సత్త్వహితార్థ ఏవ తరణేరంభోభరతశ్చోద్యమః । తృష్ణాతాపశమక్షమస్తు న రవిర్న
ధ్వాంతహృతాంతకృ- న్మేఘః స త్వఖిలార్తిహృద్విజయతే మాహేశ్వరోऽనుగ్రహః ॥ 39 ॥
ప్రతిపదార్థము:
మాహేశ్వరః + అనుగ్రహః = పరమేశ్వరుని అనుగ్రహము (కరుణ), స్థాన +
ఆస్థాన + నియంత్రణా + విరహితః = యోగ్యులైన వారు, అయోగ్యులైన
వారు అనే భేదం లేకుండా; నిర్హేతుః = కారణం లేకుండానే;
అప్రార్థితః = అడగకపోయినా; సత్యమ్ = నిజముగా;
సత్త్వ + హిత + అర్థః + ఏవ = ప్రాణుల మేలు కోసమే ప్రవర్తిస్తుంది.
తరణేః = సూర్యుని యొక్క; అంభోభరతః + చ + ఉద్యమః = నీటిని
ఆవిరిగా మార్చే ప్రయత్నం (తృష్ణను పెంచుతుంది కానీ తగ్గించదు); రవిః = సూర్యుడు; తృష్ణా + తాప + శమ + క్షమః + తు +
న = దాహమును లేదా తాపమును తగ్గించలేడు. మేఘః = మేఘము; ధ్వాంత
+ హృత్ + అంతకృత్ + న = చీకటిని పోగొట్టి వెలుగును ఇవ్వలేదు. తు = కానీ; సః = ఆ శివానుగ్రహము; అఖిల + ఆర్తి + హృత్ = సమస్త
దుఃఖాలను హరిస్తూ; విజయతే = సర్వోత్కృష్టముగా
వెలుగొందుచున్నది.
తాత్పర్యము:
పరమేశ్వరుని కరుణ సాటిలేనిది. సూర్యుడు కిరణాలను ప్రసరింపజేస్తాడు కానీ దాహాన్ని
తీర్చలేడు. మేఘం వర్షాన్ని ఇస్తుంది కానీ చీకటిని పోగొట్టలేదు. కానీ శివుని
అనుగ్రహం అడిగినా అడగకపోయినా, యోగ్యతలతో సంబంధం లేకుండా అందరిపై
ప్రసరిస్తుంది. అది అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది మరియు సంసార తాపాన్ని
చల్లారుస్తుంది. లోకంలోని సూర్యమేఘాదుల కంటే శివుని కరుణా ప్రభావమే గొప్పది.
నలభైయవ
శ్లోకము (స్తోత్రపు ముగింపు)
శ్లోకము:
బహునా కిముదీరితేన కరుణాయాముమాపతేః
స్వదశావతారకృతముర్జితశ్రియమ్ । అనిరుద్ధహృదయేప్సితాగమప్రవణాం విభ్రతామవ కంఠభూషణమ్
॥ 40 ॥
ప్రతిపదార్థము:
బహునా + ఉదీరితేన + కిమ్ = ఎక్కువగా చెప్పడం ఎందుకు?; ఉమాపతేః = పార్వతీపతియైన
శివుని యొక్క; కరుణాయామ్ = కరుణ యందు; నిశ్చయము
కలిగినవారై; అనిరుద్ధ + హృదయ + ఈప్సిత + ఆగమ + ప్రవణామ్ =
నిరోధము లేని (లేక అనిరుద్ధుని వంటి భక్తుల) హృదయ కోరికలను నెరవేర్చునట్టియు;
ఉర్జిత + శ్రియమ్ = గొప్పదైన మోక్షలక్ష్మిని ఇచ్చునట్టియు; స్వదశావతారకృతమ్ = తన పది (లేక అనేక) రూపములతో భక్తులను రక్షించునట్టి ఈ
స్తుతిని; కంఠభూషణమ్ = కంఠాభరణముగా (నిత్య పఠనముగా); విభ్రతామ్ = ధరించువారిని; అవ = రక్షించుము.
తాత్పర్యము:
ఓ స్వామీ! ఈ స్తోత్రము ద్వారా నీ కరుణను వేడుకొనే భక్తులను నీవు సర్వదా
రక్షించుము. అనిరుద్ధుని కోరికను మన్నించి కృష్ణుడు ఏ విధంగా సహాయపడ్డాడో, అలాగే నీ
కరుణ భక్తుల హృదయవాంఛలను నెరవేరుస్తుంది. ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసి నిరంతరం
పఠించేవారికి సకల శుభములు, మోక్షలక్ష్మి సిద్ధించుగాక.
వ్యాఖ్యాన
విశేషము (అనిరుద్ధుని గాథ): వ్యాఖ్యాత ఇక్కడ అనిరుద్ధుడు (కృష్ణుని మనవడు) మరియు
ఉషల ప్రేమకథను ప్రస్తావించారు. బాణాసురుని చెరలో ఉన్న అనిరుద్ధుడిని రక్షించడానికి
కృష్ణుడు వెళ్ళినట్లుగా, సంసార బంధనాలలో చిక్కుకున్న భక్తులను రక్షించడానికి శివుని
కరుణా ప్రభావం తక్షణమే పనిచేస్తుందని దీని అంతరార్థం.
ముగింపు:
ఇక్కడితో రాజానక రత్నకంఠుని వ్యాఖ్యానముతో కూడిన జగద్ధరభట్టు స్తుతి కుసుమాంజలి లోని
15వ స్తోత్రమైన 'కరుణారాధనము' సంపూర్ణమైనది.
No comments:
Post a Comment